Minister Errabelli, who slipped his tongue and said Telugudesam instead of TRS
mictv telugu

మరోసారి టంగ్ స్లిప్ అయిన మంత్రి ఎర్రబెల్లి

November 14, 2022

తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాలను సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అధికారులతో కలిసి వాటిని పరిశీలించారు. అనంతం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు బదులు తెలుగుదేశం అని అనేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

‘‘ఆస్పత్రి పెద్దగా తయారైందని, కలెక్టర్‌ ఆఫీసు కూడా పెద్దదిగా నిర్మాణం జరిగిందని, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా.. ’’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అయితే అలా అనడంతో అక్కడే ఉన్నవారు ఒకింత ఆశ్చర్యపోయారు. టీఆర్ఎస్ అని గుర్తుచేశారు. దీంతో ‘‘సారీ టీఆర్ఎస్’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన పొరపాటును సరిదిద్దారు. ఆ సమయంలో పక్కనే కూర్చొన్న మంత్రి సత్యవతి రాథోడ్ నవ్వడం కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియాలో పలువురు సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. ఆయన టీడీపీని ఇంకా మర్చిపోలేదా? అని వీడియోను షేర్ చేస్తున్నారు.