వైఎస్ ఫ్యామిలీని ఉడుంలా పట్టుకున్నావ్.. సజ్జలపై గంగుల ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

వైఎస్ ఫ్యామిలీని ఉడుంలా పట్టుకున్నావ్.. సజ్జలపై గంగుల ఫైర్

October 1, 2022

తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మరోసారి రాజుకుంది. ఏపీలో టీచర్లపై కేసులు పెట్టి లోపల వేస్తున్నారంటూ హరీష్ రావు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ, టీఆర్ఎస్ మంత్రుల మధ్య ప్రతివిమర్శలు కొనసాగాయి. కేసీఆర్‌తో హరీష్ రావుకు ఏమైనా విభేదాలుంటే పరిష్కరించుకోవాలని ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. పచ్చని కుటుంబాలను విడదీయడంలో సజ్జల సిద్ధహస్తుడని విరుచుకుపడ్డారు.

ఇప్పటికే వైఎస్సార్ కుటుంబాన్ని విడదీశావు. తల్లి నుంచి కొడుకును, చెల్లి నుంచి అన్నను విడదీసి పచ్చని సంసారంలా సాగుతున్న కేసీఆర్ ఫ్యామిలీని విడదీయాలని ప్రయత్నిస్తావా? 2014 కి ముందు సజ్జల అంటే ఎవరికి తెలుసు. వైసీపీ పార్టీని సజ్జల ఉడుములా పట్టుకున్నారు. అసలు మా తెలంగాణ వ్యవహారాలతో మీకేం సంబంధం? తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటున్నాయి. అయినా వైసీపీ పాలన బాగుంటే హరీష్ వ్యాఖ్యలపై ఎందుకు ఉలికిపడుతున్నారు. మాతో పెట్టుకుంటే ఎలా ఉంటదో 2014కి ముందు చూపించాము. మరోసారి చూపించాలంటే అందుకు మేం సిద్ధం’ అని సవాల్ చేశారు.