యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని వచ్చే నెల మూడోవారం నుంచి కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం చేతిలో ఉన్న ఎఫ్‌సీఐ ధాన్యం కొనుగోళ్లకు సహకరించడం లేదన్నారు. ఆ సంస్థతో సంబంధం లేకుండానే యాసంగిలో పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,060 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పారు.
‘ఏ’ గ్రేడ్ వరి క్వింటాల్‌కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 లను ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుండడంతో రైతులకు మేలు కలుగుతున్నది. ఇక కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు కస్టమ్ మిల్లింగ్ కోసం తరలించనున్నారు. రైస్‌మిల్లులో కస్టమ్ మిల్లింగ్ చేయిస్తే నూకల శాతం అధికంగా ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీకి సరిపడా వరి ధాన్యం బస్తాల తూకం పూర్తయిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తారు. ఈ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చడం ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయబడతాయి. వారంరోజుల్లోపే ఈ డబ్బులు అందుతాయి.