కొన్ని రోజుల క్రితం సూర్యాపేట జిల్లా కోదాడలోని గుదిబండ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఓ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు సోదరిని కూడా కోల్పోయిన చిన్నారి హర్షిత బుధవారం మృతి చెందింది. ఆనాడు వారు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన హర్షిత.. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ విషాద వార్త తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు.. పాప మృతికి సంతాపం తెలుపుతూ మానవతా దృక్పథంతో స్పందించారు.
పాప చికిత్సకై హాస్పిటల్లో కట్టాల్సిన పెండింగ్ బిల్ రూ.1,07,000 మాఫీ చేసి, చిన్నారి పార్దివ దేహన్ని వారి బంధువులకు అప్పగించేలా సహాయం చేయాలని ఎన్నారై, టీఆర్ఎస్ నాయకుడు జలగం సుధీర్ చేసిన వినతిని హరీశ్ రావు మన్నించారు. కేవలం 30 నిమిషాల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి 1,07,000 మాఫి చేశారు. అత్యవసరమైన సమయంలో సహయం చేసినందుకు మంత్రి హరీష్ రావుకి చిన్నారి హర్షిత బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ప్రభుత్వం తరపున 3,00,000 ఖర్చు చేసి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసింది తెలంగాణ ప్రభుత్వం.