వారంతా పసివాళ్లు.. ఆడిపాడాల్సిన వయస్సులో అనుకోని జబ్బు ఆ లేత హృదయాలను కబళించింది. నిరుపేద కుటుంబాలకి చెందిన ఆ చిన్నారుల ఆపరేషన్లకు రూ.లక్షల ఖర్చు చేసే స్థోమత లేదు. వారి దయనీయ స్థితి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఆ పిల్లల మొహాల్లో మళ్లీ చిరునవ్వును చిందించడానికి పెద్ద ప్రయత్నమే చేసింది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు.. వారి కోసమని బ్రిటన్ నుంచి డాక్టర్ వెంకట రమణ దన్నపునేని నేతృత్వంలోని ఆరుగురు వైద్యుల బృందాన్ని రాష్ట్రానికి రప్పించారు. మంత్రి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ వైద్య బృందం నిమ్స్ వైద్యుల, నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్స్ పరస్పర సహకారంలో చిన్నారులకు అవసరమైన సర్జరీలు(ఆర్టీరియల్ స్విచ్ రిపేయిర్, మల్టిపుల్ వీఎస్‌డీ క్లోజర్ సర్జరీలు) నిర్వహించారు.
హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్ లో గత నాలుగు రోజులకుగా చిన్నారులకు అరుదైన గుండె సర్జరీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 8 సర్జరీలు పూర్తయ్యాయి. ప్రైవేటు లో దాదాపు 5 లక్షల దాకా అయ్యే ఈ చికిత్సను పేద చిన్నారులకు ఉచితంగా అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ కు చెందిన నెల రోజుల వయసున్న శిశువు సర్జరీని కూడా విజయవంతంగా చేశారు. ప్రభుత్వ దవాఖానలో ఇలాంటి సర్జరీ జరగడం రాష్ట్రంలోనే మొదటిసారి కాగా, శిశువు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నది. క్రమంగా కోలుకుంటున్నది.
అరుదైన సర్జరీలు చేసి చిన్నారుల ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్యులను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. విజయవంతంగా సర్జరీలు పూర్తి చేసుకున్న చిన్నారులను మంత్రి ఈరోజు(శనివారం) కలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు కుశల ప్రశ్నలు వేశారు.