కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చే నిధులపై చర్చించేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని తెగేసి చెప్పారు. పన్నుల్లో వాటాగా 42 శాతం ఇస్తున్నామని అబద్ధం చెప్తున్నారని వాస్తవానికి వచ్చేది 29.6 శాతం మాత్రమేనని వెల్లడించారు.
గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ నూతన కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజీ భవనం, జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో వాటి పురోగతిని సమీక్షిస్తూ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడే బీజేపీ నేతలు, కేంద్రం చేస్తున్న అప్పుల గురించి మాట్లాడరన్నారు. కేంద్రం రోజుకు లక్ష కోట్ల చొప్పున ఇప్పటివరకు కోటి కోట్ల అప్పు చేసిందని, దేశంలో ప్రతీ పౌరుని మీద లక్షా 24 వేల అప్పుందన్నారు. నిధుల విడుదలలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందని విమర్శించారు.
పలు పథకాలను రద్దు చేయడం వల్ల తెలంగాణ వేల కోట్లు నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి కాంట్రాక్టు పద్ధతిలో కొందరికి దోచిపెడుతున్నారని, నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కిషన్ రెడ్డి ప్రయత్నించాలని చురకలంటించారు.