కాంగ్రెస్, బీజేపీ నేతలు రాష్ట్ర పరువు తీస్తున్నరు: హరీశ్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్ల రూపురేఖలు మారుస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకు 100 పడకల హాస్పిటల్స్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో అత్యాధునిక సదుపాయాలతో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 100 పడకల హాస్పిటల్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి రాష్ట్ర పరువు తీస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉద్యమం టైంలో కలిసిరాలేదు. ఇప్పుడు అభివృద్ధి చేయడానికి కలిసిరావడం లేదని ధ్వజమెత్తారు. కొడంగల్కు రేవంత్.. ఒక్క హాస్పిటల్ అయినా తెచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 మెడికల్ కాలేజీలు వచ్చాయని గుర్తుచేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ, కాంగ్రెస్ పాలిస్తున్న చోట్ల జరుగుతుందా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనపై అసత్య ప్రచారాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటయిందని తెలిపారు. కాంగ్రెస్ 20 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఒక్క మెడికల్ కాలేజీ మాత్రమే తెచ్చిందని, గడిచిన ఏడాదిలోనే బీఆర్ఎస్ పాలనలో 8 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని.. ఈ ఏడాది కూడా తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నట్లు హరీష్ ప్రకటించాడు.