నందమూరి తారక రామారావు ఆశయాలను.. ఆయన తనయుడు, హీరో నందమూరి బాలకృష్ణ నెరవేర్చుతున్నారని కొనియాడారు మంత్రి హరీశ్ రావు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ట్రస్ట్ ఛైర్మన్ బాలకృష్ణ, సభ్యులు నామా నాగేశ్వర్ రావు సహా ఇతర సభ్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సినీ, సేవా, రాజకీయ రంగాల్లో నందమూరి బాలకృష్ణ అద్భుత ప్రగతి సాధిస్తున్నారని చెప్పారు. క్యాన్సర్ రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 753 కోట్లు ఖర్చు చేసిందని హరీశ్‌రావు తెలిపారు. ఇందులో అత్యధికంగా బసవతారకం ఆస్పత్రికి వెళ్లిందన్నారు. ఈ 22 ఏండ్లలో 3 లక్షల రోగులకు ఈ ఆస్పత్రి సేవలందించడం గొప్ప విషయమన్నారు.
ఎన్టీఆర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అభిమానం అని పేర్కొన్నారు హరీశ్ రావు. నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పగానే బాలకృష్ణ అమలు చేశారన్నారు. బాలకృష్ణ అడగగానే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కింద రూ. 6 కోట్ల భారం పడకుండా సీఎం కేసీఆర్ చేశారని చెప్పారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పని ఇది అని గుర్తు చేశారు.