ఖమ్మం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును ఏపీ ప్రజలే పాలన బాగోలేదని చిత్తుచిత్తుగా ఓడించారని విమర్శించారు. ఆంధ్రలో చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బలం ఉందని చూపించుకుని.. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేదే చంద్రబాబు ఆలోచన అని విమర్శించారు. చంద్రబాబు తెలంగాణలో ఎన్ని డ్రామాలు చేసిన ఆయనకు ఒరిగేదేమి లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో తెలంగాణ ప్రాంతం అత్యంత దోపిడికి, నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. తెలంగాణకు తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు హయాంలో అతి ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయని విమర్శించారు.
రైతులని పిట్టల్లా కాల్చి చంపిన చర్రిత బాబుది
ఆనాడు యువత ఉద్యోగాలు, అభివృద్ది గురించి అడిగితే.. నక్సలైట్ల పేరుతో కాల్చి చంపించారని ఆరోపించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పేరుతో ఇక్కడి విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రైతులు ఉచిత కరెంట్ ఇవ్వమని హైదరాబాద్కు వస్తే.. బషీర్బాగ్ చౌరస్తాలో పిట్టల్లాగా కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. రైతులకు ఉచిత కరెంట్ కావాలంటే.. అది సాధ్యం కాదని, తీగలపై బట్టలు ఆరేసుకోవాలని రైతులను అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే.. సీఎం కేసీఆర్ పండగ చేసి చూపించారని చెప్పారు. చంద్రబాబువి మాటలని.. తమవి చేతలని అన్నారు. తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు దారుణాలను తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు.
చుక్కలు ఎన్ని ఉన్నా.. చంద్రుడు ఒక్కడే
మరో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని స్పష్టం చేశారు. చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లు తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అని అన్నారు. చంద్రబాబు వచ్చి మళ్లీ ఇక్కడ పార్టీని రివైవ్ చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదన్నారు. వాళ్ళను తెలంగాణ ప్రజలు రిజెక్ట్ చేశారని అన్నారు. ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అని అనుకున్న మళ్లీ రిజెక్ట్ చేస్తారని కవిత పేర్కొన్నారు.