జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. అదేవిధంగా బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలుచేస్తామన్నారు. ఇప్పటివరకు బస్తీదవాఖానల్లో కోటి మంది ప్రజలు సేవలు పొందారని వెల్లడించారు. పేదల సౌకర్యం కోసం బస్తీ దవాఖానల పని దినాల్లో మార్పు చేస్తామన్నారు. ఇకపై శనివారం సెలవు ఇస్తున్నామని, ఆదివారం పనిచేయనున్నాయని తెలిపారు.
బస్తీ దవాఖానల్లో ఉచితంగా లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ వంటి ఖరీదైన పరీక్షలు చేస్తున్నామని వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి 134 రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 158 రకాల మందులు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానలతో ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లపై ఓపీ భారం తగ్గిందని చెప్పారు. ఉస్మానియాలో 5 లక్షల మంది (60%), గాంధీ ఆసుపత్రిలో 2019లో 3.7 లక్షల మంది (56%), నిలోఫర్ ఆసుపత్రిలో 5.3 లక్షలు (44%), ఫీవర్ ఆసుపత్రిలో లక్ష 12 వేలు (72%) అవుట్ పేషెంట్ (ఓపీ) తగ్గిందన్నారు. ఇక ఈ ఆసుపత్రుల్లో శస్త్ర చికిత్సల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో అన్ని జిల్లాల్లో న్యూటిషన్ కిట్లు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే మేడ్చల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని తెలిపారు. క్రమంగా అన్ని జిల్లాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటుచేయనున్నామని వెల్లడించారు.