అవయవ దానం చేసే కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

అవయవ దానం చేసే కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

November 27, 2022

అవయవ దానం చేసేవారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి హరీశ్ రావు. అవయవ దాతల్లో పేదలు ఉంటే.. ఉచిత చదువు, ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. అవయవ దానాలను ప్రోత్సహించాలని చెప్పారు. గాంధీ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నేషనల్ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, డీఎంఈ రమేష్ హాజయ్యారు. అవయవ దానానికి ముందుకొచ్చిన వారిని హరీష్ రావు సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకరి అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ కలుగుతుందన్నారు. గతంలో డబ్బున్నవాళ్లే అవయవ మార్పిడి చేయించుకోగలిగేవారని చెప్పారు. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో పేదలకు కూడా అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీలో రూ.10 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. అవయవ దానం సక్సెస్ కావడానికి డాక్టర్ల సహకారం కావాలని పిలుపునిచ్చారు. అవయవ దాతలకు సన్మానం చిన్నదేనని చెప్పారు. మీరు ప్రాణాలు కాపాడుతున్నారు అంటూ వారిని ప్రశంసించారు. ఇప్పటివరకు 3,180 మంది అవయవాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారని హరీష్ చెప్పారు. ఆరోగ్యంపై శ్రద్ధ లేక పేషెంట్లు నిర్లక్ష్యం చేయడం వల్లే కిడ్నీలు, లివర్ ఫెయిల్ అవుతుందని హరీష్ రావు అన్నారు. శారీరక శ్రమ లేకపోవడం వల్లే బీపీ, షుగర్‌లు వస్తున్నాయని , ప్రజలు వ్యాధుల బారినపడకుండా ఉండాలంటే ఆరోగ్యం పట్ల అవగాహన అవసరమని చెప్పారు.