నిరుద్యోగులకు మంత్రి హరీష్ రావు శుభవార్త..
తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది అభ్యర్థులకు ఆదివారం ఉదయం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌లో 1030 మందికి శిక్షణ ఇచ్చామని, జిల్లాలో 580 మంది ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, త్వరలో మరో 2వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో వెల్లడిస్తామన్నారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో అగ్నిపత్ పథకంతో నాలుగేళ్ల కాంట్రాక్ట్‌తో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని, ఆ ఉద్యోగాలకు యువత సుముఖ చూపడం లేదని హరీష్‌రావు విమర్శించారు. అగ్నిపథ్ పేరిట కాంట్రాక్టు విధానం తేవడం హేయమైన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. మంత్రి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు ఉన్నారు.