పేదల సొంతింటి కల నెరవేర్చేవిధంగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి అందిస్తోంది. గ్రామాల్లో లబ్దిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇక సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించాలకునేవారికి మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత వారికి రూ.3 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. సొంత స్థలం ఉండి కూడా ఇళ్లు లేని పేదలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
సొంత ఇల్లు కట్టుకోవాలనుకొనే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్కు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజ్ఞప్తిచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకొన్న ప్రభుత్వం బడ్జెట్లో సొంత జాగ కలిగి ఇల్లు కట్టుకోవాలనుకొనే వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది.
ఈ పథకం కోసం ప్రజలు ఏడాదిన్నరకు పైగా ఎదురు చూస్తున్నారు. గృహనిర్మాణ శాఖ పంపిన లబ్ధిదారులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదం తెలిపినా ఇంకా ఈ పథకాన్ని ప్రకటించడంలో ప్రభుత్వం మాత్రం వెనుకడుగే వేస్తు వచ్చింది. తాజాగా సొంత జాగ ఉండి అర్హులైన వారికి త్వరలోనే రూ.3 లక్షల చొప్పున అర్థిక సాయం చేస్తామని హరీష్ రావు ప్రకటించారు.