ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కీలక ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఇట్టినా కంపెనీకి 2006లో రైతులు విక్రయించిన భూముల్లో వంద ఎకరాలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. అందులో రైతులు విక్రయించిన భూమి ఉంటే మార్కెట్ ధరకు వారికే విక్రయిస్తానని, సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తానే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తానని ప్రకటించారు. రైతుల భూములు వారికే ఇస్తానని, ఇందుకోసం ఎవరివద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం ఆస్పరిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో మంత్రి పాల్గొని పై విధంగా స్పందించారు. కాగా, ఈ భూముల కొనుగోలుపై గతంలో ఆయను కుటుంబీకులకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. 30 ఎకరాలకు రూ. 52 లక్షలు చెల్లించారని, ఇది బినామీగా పేర్కొంది. నోటీసులు అందుకున్న 90 రోజుల్లో సమాధానం చెప్పాలని ఆదేశించడంతో తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.