నాయిని పాడె మోసిన మంత్రి కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నాయిని పాడె మోసిన మంత్రి కేటీఆర్

October 22, 2020

Minister KTR attend Former Telangana Minister Nayani Narasimha Reddy funeral.jp

తెలంగాణ తొలి హోంమంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. నాయిని అంత్యక్రియల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొని నాయిని పాడె మోశారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు నాయిని పాడె మోసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నాయిని అంత్యక్రియలు నిర్వహించారు. గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. నాయినిని కడసారి చూసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. మరోపక్క నాయిని నర్సింహారెడ్డి సతీమణి గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్తను కడసారి చూసేందుకు ఆమె వీల్‌చైర్‌లోనే మహాప్రస్థానానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. భర్తను తలుచుకుంటూ ఆమె విలపించారు. 

కాగా, గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో నాయిని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో 12.25 గంటలకు నాయిని మృతిచెందినట్లు వైద్యులు ద్రువీకరించారు. గత నెల 28న కరోనా బారినపడిన ఆయన బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో సెంటర్‌ దవాఖానలో 16 రోజులపాటు చికిత్స పొందారు. వారంరోజుల క్రితం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చింది. అయినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో కుటుంబసభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్యాస విడిచారు.