రైతుల కల్లాలపై కేంద్రం రాద్ధాతం చేస్తోందని.. ప్రధాని మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కోరారు.
రైతుల కోసం కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ కేంద్రం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని.. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయను గుర్తుచేశారు. రాష్ట్రంలో రైతులు నిర్మించుకున్న కల్లాలతో కలిగే ప్రయోజనాలను పట్టించుకోకుండా రాష్ట్రంపై వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
రాష్ట్రంలో 750 కోట్ల రూపాయలతో 79 వేల వ్యవసాయ కల్లాలు నిర్మించాలని భావిస్తే.. కేంద్రం అడ్డుకుంటోందని కేటీఆర్ అన్నారు. ఇప్పటివరకు నిర్మించిన కల్లాలకు ఖర్చుచేసిన 151 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చిందని మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా రేపు చేపట్టే నిరసనల్లో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.