కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన 2022 జాతీయ స్టార్టప్ అవార్డుల్లో ఇంక్యుబేటర్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీహబ్ కు ఉత్తమ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నుంచి బెస్ట్ ఇంక్యుబేటర్ అవార్డును టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు అందుకున్నారు. జాతీయ స్థాయిలో టీ హబ్‌కు ఉత్తమ స్టార్టప్ ఇంక్యుబేటర్ అవార్డు దక్కిన నేపథ్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ప్రత్యేకంగా టీ హబ్ బృందాన్ని ప్రశంసించారు.
Congratulations 👏 Team @THubHyd https://t.co/omrDwgCLAW
— KTR (@KTRTRS) January 16, 2023
నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2022 కోసం మొత్తం 17 విభాగాలు, 50 ఉప విభాగాల నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఆవిష్కరణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, అభివృద్ధికి గాను టీహబ్ ను అవార్డు వరించింది. ఈ మేరకు కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, సోం ప్రకాశ్ దిల్లీలో అవార్డులను ప్రకటించారు. ఈ విభాగంలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడగా తెలంగాణ విజేతగా నిలిచింది. ప్రారంభం నుంచి సంచలనాలు సృష్టిస్తున్న టీహబ్ ఇప్పటికే 2500కు పైగా స్టార్ట్ అప్ లకు సాయం అందించిందని, వాటికి రూ.13వేల కోట్ల పెట్టుబడులు సమీకరించడంతో పాటు 12,500 మందికి ఉపాధి చూపిందని కేటీఆర్ పేర్కొన్నారు.