రాష్ట్రంలో చేపట్టిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ కేంద్రం చేస్తున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు.
తెలంగాణ పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం కల్లాలు నిర్మిస్తే… మోదీ సర్కారు కళ్లలో నిప్పులు పోసుకుంటోందని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ పట్ల కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో రూ.750కోట్లతో నిర్మించాలనుకున్న 79,000 కల్లాల నిర్మాణాలను అడ్డుకుందని ఆరోపించారు. ఉపాధి హామీ పనులతో రైతులకు ఉపయోగం జరిగితే తప్పా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయ కల్లాల నిర్మాణానికైన ఖర్చు రూ.151కోట్లను తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి కేంద్రం నోటీసు ఇచ్చిందని, మోటార్లకు మీటర్లు పెట్టబోమని చెప్పినందుకే మరో కుట్రకు తెరలేపిందని మండి పడ్డారు.
‘మన రైతుల కోసం బావుల కాడ వడ్లు ఆరబెట్టుకోడానికి ప్రభుత్వం కల్లాలు నిర్మించాలని అనుకోవడం నేరమా? రాష్ట్ర ప్రభుత్వం కల్లాలను నిర్మిస్తే, ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని అడగడం న్యాయమా? ఇదేనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ?’ అని ప్రశ్నించారు. నేటి ఆందోళన కార్యక్రమాల్లో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని, వీరితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినదించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం లో రైతు కల్లాల నిర్మాణం పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ఉదయం పది గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద జరగనున్న మహా ధర్నా లో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారు.