Minister KTR held a chit chat with the media
mictv telugu

త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు.. మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్

July 15, 2022

Minister KTR held a chit chat with the media

రాష్ట్రంలో అర్హులైన వారికి త్వరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అలాగే ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందించారు. అదేం పెద్ద విషయం కాదని, పరిస్థితులకు తగ్గట్టు కొన్ని సార్లు అలా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించగా, ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలపై మాట్లాడారు. ఆయన మాటల్లోనే..‘ముందస్తు ఎన్నికలు రావు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. కేసీఆర్ ఈ సారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. పార్టీలో కొన్నిచోట్ల గొడవలు ఉండడం సహజం. అదే టీఆర్ఎస్ బలం. ప్రభుత్వంలో నాకంటే చాలా బాగా పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మోదీ డబుల్ ఇంజిన్ సర్కారు రావాలంటున్నారు. డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీ. శత్రుదేశాల మీద ఆర్ధిక ఆంక్షలు విధించినట్టు రాష్ట్రాల అప్పులపై కేంద్రం కొర్రీలు పెడుతోంది. వారికి అభివృద్ధి చేసి ప్రజల మనసులను గెలవడం చాతకాదు. ఇక సర్వేలంటారా.. ప్రతిపక్ష పార్టీలు చేయించిన రెండు సర్వేలలో టీఆర్ఎస్ గెలుస్తుందని తేలింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 90 స్థానాల్లో గెలుస్తుంది. ఇక తమ నియోజకవర్గాలలో గెలవలేని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు సిరిసిల్లలో ఏం చేస్తారు? వారిని నేను ఆహ్వానిస్తున్నా. సిరిసిల్లలో రెండు రోజులు ఉండి అభివృద్ధి ఎలా చేయాలో నేర్చుకోమని సలహా ఇస్తున్నా. ప్రధాని వస్తే సీఎం ఆహ్వానించలేదంటున్నారు. మోదీ ప్రైవేటు కార్యక్రమానికి సీఎం ఎందుకు ఆహ్వానించాలి. గతంలో మన్మోహన్ గుజరాత్‌కు వెళ్లినప్పుడు సీఎంగా ఉన్న మోదీ ఎందుకు ఆహ్వానించలేదు’ అని వెల్లడించారు.