నాగోల్ ఫ్లైఓవర్‌ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నాగోల్ ఫ్లైఓవర్‌ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

October 26, 2022

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం ద్వారా నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్‌ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాగోల్ ఫ్లైఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, ల్యాండ్ అక్విజిషన్, ప్రాజెక్ట్‌తో కలిపి మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు చేశారని కేటీఆర్‌ తెలిపారు. ఇది 990 మీటర్ల పొడవుతో రెండు డైరెక్షన్లతో నిర్మించబడిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు సిగ్నల్‌ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దాదాపు కిలోమీటరు పొడవు ఉండే నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వలన.. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చేరుకోవచ్చు.

ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్ అండర్ పాస్ నిర్మాణంతో ఇన్నర్ రింగ్ రోడ్డుపై సాఫీగా ప్రయాణం సాగుతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులభతరం అయింది. నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో 16వ ఫ్లైఓవర్ అవుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు.