Minister Ktr Key Announcement On The Expansion Of Hyderabad Metro Third Phase
mictv telugu

BHEL నుండి లక్డీకపూల్ వరకు హైదరాబాద్ మెట్రో థర్డ్ ఫేజ్

February 12, 2023

Minister Ktr Key Announcement On The Expansion Of Hyderabad Metro Third Phase

హైదరాబాద్ మెట్రో విస్తరణపై మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ఆదివారం కీలక ప్రకటన చేశారు. లక్డీకాపూల్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు మూడో దశ మెట్రో విస్తరణ ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో మొత్తం 60 కి.మీ ఉందని, రహేజా పార్క్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో నిర్మిస్తున్నామని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ మెట్రోలో ఎవరైనా ప్రయాణం చేయవచ్చని, పాతబస్తీలో మెట్రోకు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించామని తెలిపారు.

మెట్రో వ్యవహారంలో తెలంగాణపై కేంద్రం పగబట్టినట్టుగా వ్యవహరిస్తుందన్నారు. హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని మెట్రో ప్రాజెక్టుల(కర్ణాటకలోని బెంగుళూరు, యూపీలోని లక్నో, వారణాసి, గోరఖ్ పూర్ , ఆగ్రా, కాన్పూర్, ఆలహబాద్, గుజరాత్‌లోని గాంధీనగర్)కు కేంద్రం నిధులు మంజూరు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. BHEL నుండి లక్డీకపూల్ వరకు 24 కి.మీ , నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో విస్తరణ పనుల కోసం నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా కూడా కేంద్రం నుండి స్పందన లేదన్నారు.

ఈ విషయమై గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ ను సమర్పించినట్టుగా చెప్పారు. ఈ బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు నిధులు కోరామన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కోరినా.. స్పందించడం లేదన్నారు. అయినా కూడా మున్సిపల్ శాఖ సెక్రటరీ అరవింద్ కుమార్ కేంద్ర ప్రభుత్వంలోని అధికారులను కలిసి నిధుల కోసం వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా తాము హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ నిర్మాణాన్ని ఆపడం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.