Minister KTR participated in Padmasali Atmiya Sammelan
mictv telugu

మాది చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం – కేటీఆర్

October 21, 2022

భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రెండవ అతిపెద్ద రంగం టెక్స్టైల్ రంగమని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి నేతన్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మేలు గురించి వివరించారు. ఆయన మాటల్లోనే ‘సీఎం కేసీఆర్ చిన్నప్పుడే పద్మశాలి ఇంట్లో చదువుకున్న వ్యక్తి. అందుకే ఆయనకి చేనేతల పట్ల ప్రత్యేక ప్రేమ. 2022లో భూదాన్ పోచంపల్లిలో 8 మంది చేనేత కార్మికులు చనిపోతే జోలె పట్టి సహాయం చేశారు. సిరిసిల్లలో నేతన్నలు 9 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్నారు.

సాయం చేయాలని అప్పటి ముఖ్యమంత్రికి ఉత్తరం రాస్తే స్పందించకపోవడంతో.. పార్లమెంటు సభ్యునిగా 50 లక్షల రూపాయలు నేతన్నలకు సహాయం చేశారు. నేతన్నల కన్నీళ్లు, కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి రాష్ట్రం ఏర్పడిన వెంటనే 70 కోట్ల టెక్స్టైల్ బడ్జెట్ ను 1200 కోట్లకు పెంచారు. ఎనిమిదేళ్లలో ప్రభుత్వం చేనేత రంగానికి రూ. 5,752 కోట్లు కేటాయించింది. కానీ 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు ఇందులో 10 శాతం కూడా ఖర్చు చేయలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా 40% యార్న్ సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. 26 వేల మంది కార్మికులకు కరోనా కాలంలో దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను ముందుగానే విడుదల చేశాము. ఈ ప్రభుత్వం నేతన్నలు తెచ్చిన ప్రభుత్వం. వారి సంక్షేమం కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపడతాం. నిజమైన కార్మికుడికి లబ్ధి జరగాలన్న లక్ష్యంతోనే మగ్గాల జియో ట్యాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టాము.

నేతన్నకు బీమా కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించాం. ఎవరైనా నేత కార్మికుడు దురదృష్టవశాత్తు చనిపోతే వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలను వారి కుటుంబాలకు అందజేస్తున్నాం. ఇప్పటికే 40,000 కు పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో చేరారు. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వెంటనే చేరాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందుకు మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం.. చేనేతల ప్రభుత్వం. ఒక చేనేత సమీకృత కేంద్రాన్ని నారాయణ పేట్ లో ఏర్పాటు చేస్తున్నాం. నల్గొండ జిల్లాలోని కొయ్యలగూడెం, పుట్టపాక వంటి చేనేత క్లస్టర్లలో ఉత్పత్తి అవుతున్న పట్టుచీరల అమ్మకానికి ప్రత్యేక మార్కెటింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మీద ఒక అవార్డుని కూడా ప్రభుత్వం నెలకొల్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హార్టికల్చర్ యూనివర్సిటీకి సైతం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాం. ఏ జలదృశ్యంలో అయితే అప్పటి ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించిందో.. అక్కడే ఒక అద్భుతమైన బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించాం. హైదరాబాద్లోని కోకాపేటలో ఖరీదైన స్థలాన్ని పద్మశాలి ఆత్మగౌరవ భవనానికి ఇచ్చాము. త్వరలోనే ఈ భవన నిర్మాణాన్ని పూర్తిచేసి అప్పజెప్తాం. ఒరిస్సా నుంచి వచ్చిన ఆ రాష్ట్ర టెక్స్టైల్ శాఖ మంత్రి రీతిగా సాహూ మన రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రశంసలు అందించారు. ఇంత చక్కటి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న కార్యక్రమాలను ఒరిస్సాలో ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇలా అనేక రాష్ట్రాల నుంచి మన కార్యక్రమాలకు పథకాలకు అభినందనలు అందుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం నేతన్న సంక్షేమానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నారు.
జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు, జాతీయ పవర్లూమ్ బోర్డు, మహాత్మా గాంధీ భుంకర్ యోజన, నేతన్నల పొదుపు పథకం రద్దు.. నేతన్నల భీమా పథకం రద్దు.. ఇలా అన్నింటిని రద్దు చేస్తోంది. దేశంలో మొట్టమొదటిసారి చేనేతల పైన ఐదు శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్న నేతన్నలను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ దేశవ్యాప్తంగా ఎన్నో విజ్ఞప్తులు వచ్చినా.. ప్రధానమంత్రి స్పందించలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం చేనేత మీద ఐదు శాతం జీఎస్టీ రద్దు చేయాలంటూ.. ప్రధానమంత్రి కి లేఖ రాస్తున్నాను. రాష్ట్రంలోని నేతన్నలంతా లక్షలాదిగా ప్రధానమంత్రి కి ఈ మేరకు ఉత్తరాలు రాయాలి. ఈ మధ్య దినపత్రికలో శ్రామికులుగా పోయి.. పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే శీర్షికతో తెలంగాణాలో టెక్స్ట్ టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ నుండి వలస వెళ్లిన వారు తిరిగివచ్చారని వార్త చదివినప్పుడు గర్వంగా అనిపించింది. ఇది మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం, అభివృద్ధి విషయంలో సరైన మార్గంలో పోతున్నది అనడానికి ఇదొక ఉదాహరణ. నేతన్నల సంక్షేమం కొసం తెలంగాణ అడిగిన ఏ ప్రతిపాదనకు కేంద్రం నుంచి స్పందన లేదు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి కేంద్రం మొండిచేయి చూపింది. హైదరాబాద్ నగరంలో నేషనల్ టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే స్పందన లేదు. హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరితే స్పందన లేదు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేయాలని కోరితే ఉలుకూ పలుకూ లేదు. పెద్ద ఎత్తున బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కోరితే స్పందన లేదు.

నారాయణపేటలో స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హ్యాండ్లూమ్ పార్క్ పెడతామన్నారు. నాలుగేళ్లయినా దానికి దిక్కులేదు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య విధానాల వలన బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల కన్నా వస్త్ర ఉత్పత్తిలో బాగా వెనుకబడి ఉన్నాం. ఏ ప్రభుత్వం అయితే నేతన్నల కోసం పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత నేత కార్మికుల పైన ఉన్నదని కోరుతున్నాను. సొంత జాగా ఉండి అర్హులైన నేత కార్మికులందరికీ.. ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలను ఇచ్చే బాధ్యత నాది. ఆసు పరికరాలు, దాబిలు, మగ్గాలు, జకార్డులు, కండెల మిషన్లు, మగ్గం పాకలను నేతన్నలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మా ప్రభుత్వం అనేక కొత్త పథకాలు.. సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలో మీ వెంట నిలబడ్డది. అలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మరియు బిజెపి యొక్క అసత్యాలను అబద్ధాలను నమ్మితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టెక్స్టైల్ రంగం మరోసారి సంక్షోభంలోకి పోతుందని నేత కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా’నని వ్యాఖ్యానించారు.