Minister Ktr Responded On Nizam College Students Protest
mictv telugu

నిజాం కాలేజీ విద్యార్థినుల ఆందోళనపై స్పందించిన కేటీఆర్

November 8, 2022

నిజాం కాలేజ్ విద్యార్థినులు చేస్తున్న ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. హాస్టల్ కేటాయింపు సమస్యపై నిజాం కాలేజ్‌ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్‌లో యూజీ విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి ఆందోళనపై స్పందించిన కేటీఆర్.. ఈ విషయంలో జోక్యం చేసుకుని విద్యార్థినిల సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు. ఈ మేరకు ఓ నెటిజన్ ట్వీట్‌కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు.

విద్యార్థుల కోరిక మేరకు బాలికల హాస్టల్‌ను నిర్మించి కళాశాలకు అప్పగించడం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం.. హాస్టల్ నిర్మాణం చేసి కాలేజీకి అందించిన తర్వాత కూడా ఈ వివాదం అనవసరమని కేటీఆర్‌ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి అసంబద్ధంగా కనిపిస్తోందన్నారు.సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు సూచించారు. మరోవైపు ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్‌కు కేటీఆర్ సూచించారు.

గత కొన్నిరోజులుగా నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్‌లో విద్యార్థినీలకు వసతి కల్పించాలని కోరుతూ నిజాం కళాశాల విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించారని.. అయితే ఇంతవరకు హాస్టల్‌లో యూజీ విద్యార్థినులకు వసతి కల్పించేందుకు కళాశాల యాజమాన్యం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కాలేజ్ హాస్టళ్లలో వసతి అవసరమైన దాదాపు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో పెద్ద మొత్తం డబ్బులు చెల్లించి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.