తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రముఖ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ ఈవెంట్ బయో ఏషియా-2023 20వ ఎడిషన్ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో మంత్రి కేటీఆర్, నీతిఆయోగ్ సభ్యులు వీకే పాల్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు యూకే భాగస్వామ్య దేశంగా వ్యవహరిస్తోంది. అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్ కేర్ ఇతివృత్తంతంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని.. ఔషధ ఉత్పత్తికి ఆసియాలోనే హైదరాబాద్ పెద్ద నగరమని తెలిపారు.
లైఫ్ సైన్సెస్, ఫార్మారంగ, పర్యావరణ వ్యవస్థకు తెలంగాణ నిలయంగా ఉందని చెప్పారు. 8 వందలకుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని వెల్లడించారు. దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నదని చెప్పారు. టాప్ -10 ఫార్మా కంపెనీల్లో 4 తెలంగాణ నుంచే ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని కేటీఆర్ తెలిపారు. శాస్త్రవేత్తలు, మేధావులు ఏకమై వైద్య సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు.