రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలను కట్టడి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ నాయకులు 12 మందిపై ఈడీని, సీబీఐని పంపించారని.. ఇవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు అని కేటీఆర్ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఓవైపు ప్రతి పక్షాలపై కేసుల దాడి చేస్తూ.. మరోవైపు ప్రజలపై ధరల దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతం అదానీ మోదీ బినామీ అని ప్రపంచానికి తెలుసని కేటీఆర్ ఆరోపణలు చేశారు. అదానీ.. మోదీ బినామీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడని అన్నారు. ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్లు డ్రగ్స్ దొరికినా అదానీపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్కామ్‌ల పేరుతో 5,422 ఈడీ కేసులు నమోదు చేయించారని అన్నారు. ఈడీ వందశాతం విపక్ష నేతలపైనే దాడులు చేస్తోందని చెప్పారు. 23 కేసుల్లో మాత్రమే నేరం రుజువైందని వివరించారు. కానీ అసలు స్కామ్‌లు వేరే ఉన్నాయని, వాటి గురించి మీడియాకు తెలిపారు.
ఆ ఐదు స్కామ్‌లు ఏంటంటే..
• గుజరాత్ లో నిషేధం ఉన్నా లిక్కర్ తాగి 42 మంది మరణించడం పెద్ద స్కామ్
• అదానీ నుంచి బొగ్గు కొనాలని పాలసీ చెయ్యడం మరో స్కామ్
• నిబంధనలు కాదని ఆరు ఎయిర్ పోర్టులు అదానీకి ఇవ్వడం ఒక స్కామ్
• అదానీ పోర్టుల్లో రూ.21 వేల కోట్ల డ్రగ్స్ దొరికినా విచారణ లేకపోవడం కూడా స్కామ్
• కృష్ణపట్నం, గంగవరం, ముంబై ఎయిర్ పోర్ట్‌లు లాక్కోవడం స్కామ్