Minister KTR Sensational Comments On PM Modi In Davos at Meet and Greet NRI Program
mictv telugu

‘లాజిక్‌లు అర్థం చేసుకోలేనివాళ్లకు ఏం చెప్పగలం?’

January 16, 2023

Minister KTR Sensational Comments On PM Modi In Davos at Meet and Greet NRI Program

స్వి ట్జర్లాండ్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ దావోస్‌ వెళ్లారు. ఈ సందర్భంగా దావోస్‌ చేరుకున్న కేటీఆర్‌కు అక్కడి స్థానిక తెలుగువారు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా ప్రవాస భారతీయులతో మకర సంక్రాంతి జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రవాస అభ్యర్థులందరికీ ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. నేను కూడా ఒక ప్రవాస భారతీయుడినే, కొంతకాలం విదేశంలో పనిచేసి భారతదేశం వెళ్లానన్నారు. దేశంలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే ప్రవాస భారతీయులకు దేశ వ్యవహారాలు, స్థానికంగా ఉన్న అంశాలు, అభివృద్ధి పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుందని, దావోస్‌ వచ్చిన ప్రతిసారి స్విట్జర్లాండ్ నుంచి ప్రవాస భారతీయులు ఇచ్చే మద్దతు చాలా గొప్పగా ఉంటుందని ఆయన కొనియాడారు.

గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే

మానవ జీవితం పరిమిత కాలమనే ఫిలాసఫీని నమ్మి, సాధ్యమైనంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటీ శాఖ వలన కొంత ప్రచారం లభిస్తుంది… కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతమైన పనితీరుతో గొప్ప ప్రగతిని సాధిస్తున్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అన్ని రంగాల్లో తెలంగాణ సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధించిందని గర్వంగా చెప్పగలను. ఒక వైపు ఐటీ పరిశ్రమ ఉత్పత్తులు, మరోవైపు వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులు అనేక రెట్లు పెరిగినాయి. ఒకవైపు పల్లె ప్రగతి, మరోవైపు పట్టణ ప్రగతి ద్వారా పల్లెలు, పట్టణాలు సైతం దేశంలో ఆదర్శ గ్రామాలు, పట్టణాలుగా గుర్తింపు పొందాయి. స్వతంత్ర భారతదేశ చర్చలు కేసీఆర్ గారు గ్రామ జీవితాన్ని అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంకెవరు అర్థం చేసుకోలేదంటే అతిశయోశక్తి కాదు. గ్రామానికి కావాల్సిన కనీసం మౌలిక వసతుల కల్పన మరియు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుంది. ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం వంటి మానవీయ దృక్పథ కార్యక్రమం నుంచి మొదలుకొని గ్రామానికి అవసరమైన నర్సరీ, డంప్ యార్డ్ వరకు ఇలా అన్ని రకాల సౌకర్యాలను గ్రామంలో కల్పిస్తున్న ప్రభుత్వం మాది. ఇంటింటికి నీళ్లు ఇవ్వాలన్న సంకల్పాన్ని చేపట్టి, ఆ లక్ష్యాన్ని పూర్తి చేసిన భారతదేశంలోనే తెలంగాణను ఒక ఆదర్శన నమూనా గా మార్చిన ఘనత కేసిఆర్‌ది.

అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు

వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టినది. 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతుబంధు, రైతు బీమా, ఎరువుల సరఫరా, సాగునీరు వంటి అనేక కార్యక్రమాలను చేపట్టిన ప్రభుత్వం మాది. తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించి లక్షలాదిగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం కూడా మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ చట్టాలు ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ను ఏర్పాటు చేశాం . దీంతోపాటు హరితహారం వంటి కార్యక్రమాల ఫలితంగా 7.7% గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది. మేము చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మాతో సానుకూలంగా లేని కేంద్ర ప్రభుత్వం సైతం అవార్డులను ఇచ్చే పరిస్థితి నెలకొంది. దీంతోపాటు అనేక అంతర్జాతీయ సంస్థలు సైతం తెలంగాణ నగరాలకు, తెలంగాణ కార్యక్రమాలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన రోజే చెప్పిన విభజన వికాసం కోసమే అన్నాము. రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని ఆకాంక్షించాం. స్వపరిపాలన కావాలి, స్వయంపాలన కావాలి అన్న నినాదంతో ఉద్యమం చేశాం, ఆమేరకు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాము.

ఇవన్నీ వాళ్లెందుకు చేయలేకపోయారు..?

ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, 24 గంటల విద్యుత్ ఇవ్వడం, భారీ కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలో కట్టడం చిన్న విషయాలయితే మరి గతంలో మా కన్నా ముందు పరిపాలించిన పార్టీలు ఎందుకు చేయలేకపోయినాయో ప్రజలకు చెప్పాలి.అందులో తెలంగాణ భవిష్యత్తుకు మార్గం వేసే భారీ ప్రాజెక్టులపై నిధులు ఖర్చు పెడితే దాన్ని అప్పు, తప్పు అంటూ కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు…. ప్రజలకు నీళ్లు ఇచ్చేందుకు, పంటలకు నీళ్ళిచెందుకు చేపట్టిన ప్రాజెక్టులు కడితే తప్పా, పవర్ ప్లాంటులు, నీళ్ళ ట్యాంకులు కడితే తప్పా, ఇలా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే అది అప్పు అవుతుందా లేకా పెట్టుబడి అవుతుందా అని ప్రశ్నించారు కేటీఆర్. 100 లక్షల కోట్ల అప్పుచేసి కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధానమంత్రి గానీ దేశానికి ఉపయోగపడేలా చేసిన పని ఒక్కటైన ఉన్నదా చెప్పాలి.

వంద లక్షల కోట్ల అప్పు.. ఎవరి కోసం చేశారు?

‘ తెలంగాణ అప్పులను ప్రశ్నించే అర్హత బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడుంది? గతంలో 14మంది ప్రధానులు 56లక్షల కోట్లు అప్పులు చేస్తే.. మోడీ ఒక్కరే వంద లక్షల కోట్లు అప్పులు చేశారు. మరి ఆ వంద లక్షల కోట్ల అప్పు ఏ పనికి పెట్టారు? తెలంగాణ చేసే ప్రతీ పైసా అప్పుకు ప్రతిఫలం ఉంటుంది. మరి వంద లక్షణ కోట్ల అప్పులతో కేంద్రం ఏ మంచి పని చేసింది. అప్పులు చేసి లాభాలొచ్చే రీతిలో పెట్టుబడి పెడితే తప్పులేదు. తెలంగాణ అప్పులపై బీజేపీ నానా యాగీ చేస్తోంది. మేం అప్పుచేసినా, ప్రతీపైసా పెట్టిబడి లాభాలతో తిరిగొస్తుంది. లాజిక్‌లు అర్థం చేసుకోలేనివాళ్లకు ఏం చెప్పగలం’ అంటూ మోడీకి చురకలంటించారు కేటీఆర్‌.

అవగాహన లేనివాళ్లకు ఏం చెబుతాం?

భారతదేశ సామాజిక ఆర్థిక పరిస్థితుల పైన అవగాహన లేనివాళ్లే పేదలకు ఇచ్చే పథకాలను ఉచిత తాయిలాలంటూ హేళన చేస్తున్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అయినా.. ఇంకెవరైనా పేదలకు ఉచితాలు అనుచితమంటూ మాట్లాడితే అది కచ్చితంగా తప్పే… భారతదేశం ఈరోజు గ్లోబల్ క్యాపిటల్ ఆఫ్ పూర్ పీపుల్ గా ఉన్నది… పేదల ప్రపంచ రాజధానిగా ఉన్నది… ఈ విషయాన్ని మరిచి పేదల సంక్షేమం పట్ల అవగాహన లేకుండా అవహేళనతో మాట్లాడుతూ కొన్ని పార్టీలు ఇంకా ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రంగాల్లో తన సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ మరింత అభివృద్ధి కోసం పాటుపడాల్సిన అవసరం ఇంకా ఉన్నది. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ప్రవాస భారతీయులు తమ భాగస్వామ్యాన్ని అందించే వీలున్నది. తెలంగాణ ప్రభుత్వానికి పెట్టుబడులు వస్తే మరిన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వ విధానాలను, అక్కడి పరిస్థితులను తమ స్థాయిలలో ప్రచారం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నం చేయాలని ప్రవాస భారతీయులను కేటీఆర్ కోరారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పలు తెలుగు ఎన్ఆర్ఐ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.