వ్యాపార అవకాశాలు ఉంటే పెట్టుబడులు ఎప్పుడూ విదేశాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తాయని తెలంగాణ నిరూపించింది. గుజరాత్‌కి చెందిన వెల్‌స్పన్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్ లిమిటెడ్ కంపెనీ తన యూనిట్‌ని రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లిలో నిర్మించింది. దీన్ని బుధవారం మంత్రి కేటీఆర్ సంస్థ చైర్మన్ బాలకృష్ణ గోయెంకాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘గుజరాత్ కంపెనీ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టింది. రాబోయే ఐదేళ్లలో 3 నుంచి 5 వేల కోట్ల పెట్టుబడి పెడతామని చైర్మన్ చెప్పారు. స్థానిక మహిళలను భాగస్వాములను చేసి వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. చందన్‌వెల్లిలో తయారయ్యే ఉత్పత్తుల్లో సగం సిలికాన్ వ్యాలీకే వెళ్తాయి. గతంలో చందన్ వెల్లిలో ఒక్క పరిశ్రమ ఉండేది కాదు.
కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలతో పరిశ్రమలకు హబ్‌గా తయారైంది. యావత్ తెలంగాణ కూడా త్వరలో అతిపెద్ద పారిశ్రామిక సమూహంగా మారుతుంద’ని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి మాట్లాడారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ తరహాలో అత్యంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నామని, కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో పనులు ఆలస్యమయ్యాయని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.