హవాలా డబ్బుల కోసం వివేక్‌ని అడ్డం పెట్టుకున్నరు : కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

హవాలా డబ్బుల కోసం వివేక్‌ని అడ్డం పెట్టుకున్నరు : కేటీఆర్

November 6, 2022

Minister KTR spoke to the media about the victory in Munugode

మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ పది వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. విజయం పట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూనే బీజేపీని తీవ్రంగా దుయ్యబట్టారు. ఆధారలతో సహా కడిగి పారేశారు. ఎన్నికల్లో ఏ విధంగా అక్రమాలకు పాల్పడిందీ వివరించారు. చివరికి ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని, కాస్త మెజారిటీ తగ్గినా గెలుపును ఆపలేకపోయారని దుయ్యబట్టారు. ఆయన మాటల్లోనే.. ‘అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు. గెలుపు కోసం పని చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. వరుసగా మూడు ఎన్నికల్లో గెలిపించిన జిల్లా ప్రజలకు రుణపడి ఉంటాం.

మొట్టమొదటి సారి జిల్లాలోని 12 స్థానాలను కేసీఆర్‌పై నమ్మకంతో కట్టబెట్టినందుకు, కొత్త చరిత్ర లిఖించినందుకు ప్రజలకు ప్రణమిల్లుతున్నాం. రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి కానీ, హత్యలు ఉండవనే సామెత నిజమైంది. ఢిల్లీ పెద్దలైన మోదీ, అమిత్ షాలకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిది. ఇక్కడ కనపడే ముఖం రాజగోపాల్ రెడ్డిదే అయినా వెనకుండి నడిపించింది మాత్రం ఆ ఇద్దరే. డబ్బు సంచులను కుమ్మరించారు. అభ్యర్ధిని ఎలాగైనా గెలిపించాలని అడ్డదారులు తొక్కారు. ఆ పార్టీ నాయకులు, వారి అనుచరులు డబ్బు సంచులతో పట్టుబడ్డది నిజం కాదా? డాక్టర్ వివేక్ హవాలా ద్వారా గుజరాత్ నుంచి డబ్బులు తెస్తూ దొరికింది అబద్ధమా? గతంలో ఈటెల రాజేందర్‌కి గాని, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి గానీ ఆయన కంపెనీ నుంచి 75 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయడం వాస్తవం కాదా? జమున హ్యాచరీస్‌కి 25 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయడం నిజం కాదా? ఓ హవాలా ఆపరేటర్ మాదిరి వివేక్‌ని అడ్డం పెట్టుకున్నరు. వీటన్నింటిపై ఈసీకి ఫిర్యాదు చేస్తే ఒత్తిడి తెచ్చి ప్రేక్షకపాత్ర వహించేలా చేశారు. 15 కంపెనీల బలగాలను దించారు. 45 ఐటీ టీంలను దించి గ్రామీణ నియోజకవర్గంపై దండయాత్ర చేశారు. విచ్చలవిడితనం, అధికార దుర్వినియోగానికి పాల్పడి కొంత మెజారిటీ తగ్గించగలిగారు కానీ గెలుపును మాత్రం ఆపలేకపోయారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.