హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్.. ఇక ట్రాఫిక్ ఫ్రీ - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్.. ఇక ట్రాఫిక్ ఫ్రీ

October 26, 2022

Minister KTR to inaugurate Nagole flyover today

హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు సిగ్నల్ రహిత మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు జీహెచ్‌ఎంసీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నగరమంతటా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. GHMC ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌డీపీ (SRDP)కార్యక్రమం ద్వారా నిర్మించిన నాగోల్ ఫ్లైఓవర్‌ను నేడు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. మొత్తం రూ.143 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను జీహెచ్ఎంసీ నిర్మించింది. 990 మీటర్ల పొడవున ఆరు లేన్లుగా నిర్మించిన ఈ టూ వే ఫ్లైఓవర్‌తో ఉప్పల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించడానికి అవకాశం ఏర్పడనుంది. ఉప్పల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఎలాంటి ట్రాఫిక్ లేకుండా చేరుకోవచ్చు.

ఇప్పటికే ఎల్బీనగర్ జంక్షన్ అండర్ పాస్ నిర్మాణంతో ఇన్నర్ రింగ్ రోడ్డుపై సాఫీగా ప్రయాణం సాగుతోంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులభతరం అవుతుంది. నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండడంతో ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో 16వ ఫ్లైఓవర్ అవుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు వివరించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మొత్తం 47 పనులు తీసుకోగా, ఇప్పటివరకు 31 పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.