బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకర్గంలోని వేలేరు మండలం షోడశపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో రైతులు సాగునీటి కోసం ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం మూడు మినీ లిఫ్టులు నిర్మించాలని సంకల్పించింది. రూ.150 కోట్లు అవుతాయని అంచనావేసి యుద్ధప్రాతిపదికన వీటి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. నిధులు కూడా విడుదల చేసింది. ఈ మూడు పథకాలకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్ 27న స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.