Minister KTR's heartfelt letter to Telangana youth
mictv telugu

కష్టపడి చదవండి.. కలల్ని నిజం చేసుకోండి..

December 4, 2022

తెలంగాణ యువతకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు. తెలంగాణలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో
కష్టపడి చదివి కొలువు సాధించాలని సూచించారు. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అతి వేగంతో చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చినట్లు కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను అతితక్కువ సమయంలో భర్తీ చేసి దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలవబోతుందని పేర్కొన్నారు.

స్థానికులకే ఉద్యోగాలు

ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించినట్లు వెల్లడించారు. ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆర్‌డివో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కడం వెనుక కేసీఆర్ ఎనలేని కృష్టి ఉందని కొనియాడారు. విద్యార్థులు, యువకుల కోరిక మేరకు వయోపరిమితి సడలించామన్నారు. ఉద్యోగాలను భర్తీ చేస్తూనే, ఏళ్ళ తరబడి ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరించామని..త్వరలోనే మరో 10 వేల ఉద్యోగాలు క్రమద్ధీకరిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూపు వన్ ఉద్యోగాలలోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికినట్లు వివరించారు.

ప్రైవేట్ రంగంలోను ఉపాధి అవకాశాలు

కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే గాక, ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను టీఆర్ఎస్ సర్కార్ మెరుగుపరిచినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఇప్పటిదాకా సుమారు 17 లక్షలమందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణదే అన్నారు. అద్భుతమైన ఆలోచనలతో ఉన్న ఔత్సాహిక యువత కోసం స్టార్టప్ ఈకో సిస్టం ను ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, టి.ఎస్.ఐ.సి. వంటి వేదికలు వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉన్నాయన్నారు.

నిరుద్యోగులకు వసతులు

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల నేపథ్యంలో సిఎం కేసీఆర్ సూచన మేరకు దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత స్థాయిలో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న యువత కోసం కోచింగ్ సెంటర్లను ఇతర వసతులను ఏర్పాటు చేశారని కేటీఆర్ లేఖలో తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల తరఫున నిరుద్యోగులకు శిక్షణా తరగతుల నిర్వహణ కూడా ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. లైబ్రరీలను నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని కేటీఆర్ సూచించారు.

కలలను సాకారం చేసుకోండి

ప్రతీ ఒక్కరు ఆత్మవిశ్వాసం, పట్టుదల, ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలని కేటీఆర్ కోరారు. ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవాలని సూచించారు. “ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ ప్రయత్నాలు సఫలం కావాలని ఒక సోదరుడిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అంటూ కేటీఆర్ లేఖ విడుదల చేశారు.