మేడ్చల్ జిల్లాలో పదవుల కేటాయింపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అసంతృప్తి గళంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తన తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేయటం పట్ల మీడియాతో మట్లాడారు. పదవులు ఇచ్చేది.. కేసీఆర్, కేటీఆర్ తప్ప తాను కాదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను గాంధేయవాదినని.. ఎవరితో గొడవ పెట్టుకునే రకం కాదని తెలిపారు. తమది క్రమశిక్షణ గల పార్టీ అని వ్యాఖ్యానించిన ఆయన.. ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్తానన్న మల్లారెడ్డి.. అవసరమైతే అందరినీ ఇంటికి ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. తమ మధ్య ఆ స్థాయిలో సమస్యలేదని.. కావాలనే కొందరు పెద్దది చేసి చూపుతున్నట్లు ఆరోపించారు.
నామినేటెడ్ పదవుల భర్తీలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ.. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేకానంద్, భేతి సుభాష్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ శివారు దూలపల్లిలోని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో వారు సమావేశమయ్యారు. అన్ని పదవులను మంత్రి తన సొంత నియోజకవర్గం మేడ్చల్ నాయకులకే కట్టబెడుతున్నారని, పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం దక్కడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి స్పందించారు.
ఇవి కూడా చదవండి :
1.తెలంగాణ అప్పు @రూ.3,12,191 కోట్లు
2.తొలిరోజున ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ అడిగిన ప్రశ్నలివే..
3.నేడు తెలంగాణకు పంజాబ్ ముఖ్యమంత్రి..