తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఏపీ రాజకీయాల పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పోటీ చేయడం పైన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా పైన, పోలవరం ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ఇప్పటి వరకు ప్రత్యేక హోదా సాధించలేదని అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు అవుతున్నా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, విభజనలో రకరకాల హామీలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మాటను మరిచిపోయిందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే విభజనలో ఇచ్చిన హామీలు అన్నింటినీ కేసీఆర్ పూర్తి చేస్తారని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము ధైర్యం ఒక్క కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కి మంచి స్పందన లభిస్తోందని , 2024 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని మంత్రి అన్నారు. ఇక ఏపీలో విజయం సాధించడం కూడా ఖాయమన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆలోచనలో పడ్డారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు చేయడం లేదన్నారు. మరోవైపు కేసీఆర్ సమక్షంలో ఈరోజు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.