రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి నా డబ్బుతో జరిగింది - మంత్రి సంచలన ఆరోపణ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి నా డబ్బుతో జరిగింది – మంత్రి సంచలన ఆరోపణ

May 24, 2022

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ తనను అడుగడుగునా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నట్టు తనపై రేవంత్ చేసిన ఆరోపణలు నిరాధారమని వెల్లడించారు. మంగళవారం మంత్రి మల్లారెడ్డి టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌కు తనకు మధ్య గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ‘రేవంత్ రెడ్డి నన్ను మామూలుగా బ్లాక్ మెయిల్ చేయలేదు. ఇద్దరం టీడీపీలో ఉన్నప్పుడు మల్కాజ్ గిరి సీటు నాకు రాకుండా చేశాడు. ఒకే పార్టీలో ఉన్నా నాకు వేధింపులు తప్పలేదు. ఆయన కూతురు పెళ్లి నా డబ్బుతో జరిగింది. దీనిపై యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిపై ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. రేవంత్ సిద్ధమా? భూములను ఆక్రమించుకున్నానని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను నేను కొనలేదు. బహిరంగ మార్కెట్‌లో పలుకుతున్న ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయానికి భూములు కొన్నాను. భూమి నేనొక్కడినే కొంటున్నానా? కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొనడం లేదా? ఇప్పటికీ రేవంత్ నన్ను విడిచిపెట్టకుండా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.