గురుకులాల్లో ఇకపై ఈ కోర్సు ఉండదు.. మంత్రి ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

గురుకులాల్లో ఇకపై ఈ కోర్సు ఉండదు.. మంత్రి ప్రకటన

November 7, 2022

ఆధునిక ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందిస్తున్న గురుకులాలు.. విద్యార్దుల ఆదరణను చూరగొన్నాయి. ప్రస్తుత కాలానికి అనుగుణమైన కోర్సులను రూపొందించి అందులో విద్యార్ధులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో గురుకులాలు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి గురుకులాల్లో వచ్చే ఏడాది నుంచి ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్) కోర్సు అందుబాటులో ఉండదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు.

ఈ కోర్సును రద్దు చేస్తున్నట్టు ఆయన సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ కోర్సు స్థానంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని వివరించారు. కాగా, గణితంతో పాటు ఆర్ధిక అంశాలపై కూడా మంచి పట్టు సాధించాలనుకునే వారు ఇప్పటివరకు ఈ కోర్సు ఎంపిక చేసుకునేవారు. ఇప్పుడు ఆ ఆప్షన్ లేకుండా పోయింది.