Minister Niranjan Reddy Slams On Central Govt Over ED Summons MLC Kavitha
mictv telugu

ED Summons MLC Kavitha : క‌విత‌కు ఈడీ నోటీసులు.. విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్ట

March 8, 2023

Minister Nirajan Reddy Slams On Central Govt Over ED Summons MLC Kavitha

 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు ఈడీ నోటీసులు జారీ చేయ‌డం కేంద్ర ప్ర‌భుత్వ క‌క్ష‌పూరిత చ‌ర్యే అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాజ‌కీయ దురుద్దేశంతోనే క‌విత‌కు ఈడీ నోటీసులు జారీ చేసింద‌న్నారు. కేంద్ర విధానాల‌ను ప్ర‌శ్నించిన వారిపై కేసులతో లొంగ‌దీసుకోవాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు

కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ నోటీసులివ్వడం విద్వేషపూరిత రాజకీయాలకు పరాకాష్టగా తెలిపారు. కేసీఆర్ ను ఎదుర్కోలేక కవితపై కక్ష్యపూరిత కేసులు నమోదు చేస్తున్నారన్నారు. దర్యాప్తు సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టించి, వాటి విశ్వసనీయతను దెబ్బతీసిందని.. ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులు, కేసులు అంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ఇదే దర్యాప్తు సంస్థలతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిన ఆదానీ గురించి కేంద్రం ఎందుకు నోరు మెదపదు?ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు దర్యాప్తు చేయవు? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎమ్మెల్యేలను కొని అక్రమంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన బీజేపీ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది నిజం కాదా? అని అడిగారు.

కేవలం తమ మాటవినని వారిపై కేసులు పెడుతున్నారని.. దారికి వచ్చిన వారిపై దయ చూపిస్తున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ‘ఇటీవల మేఘాలయ ఎన్నికలలో మోడీ, అమిత్ షా అక్కడి ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మీద తీవ్ర అవినీతి ఆరోపణలు చేయలేదా? ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీ అదే సంగ్మాకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో చేరింది నిజం కాదా ? అదే సంగ్మా ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు JP.నడ్డా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మలు హాజరు కావడం బీజేపీ ద్వంద నీతికి అద్దం పడుతలేదా?’ అని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి.

‘దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ దేశ రాజకీయాలను, వ్యవస్థను నాశనం చేస్తున్నారు. భారత ప్రజాస్వామిక వ్యవస్థను దిగజార్చడం గర్హనీయం. రాష్ట్ర సాధన కోసం పార్టీ ఏర్పాటు చేసి 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించిన చరిత్ర కేసీఆర్, బీఆర్ఎస్ ది. కేసులతో వేధించి ఏదో సాధిస్తామనుకోవడం అత్యాశ. కేసీఆర్ అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్ నినాదం దేశ రాజకీయాల్లోకి కొత్త ఆలోచనలను రగిలిస్తున్నది. పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉంది .. అది ఈ నేల మాకు వారసత్వంగా ఇచ్చింది కేసులతో బీఆర్ఎస్ ఎదుగుదలను అడ్డుకోలేరు. తెలంగాణలో బీజేపీకి అధికారం పగటికల. రాబోయే ఎన్నికలలో బీజేపీ నియంతృత్వ విధానాలకు దేశ ప్రజలే జవాబిస్తారు’ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బీజేపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.