కుప్పం నియోజకవర్గంలో అప్రతిహతంగా గెల్చుకుంటూ వస్తున్న టీడీపీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడుపై తమిళ హీరో విశాల్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. విశాల్‌ను నిలబెడితే.. తమిళనాడు సరిహద్దులో ఉండడం, విశాల్ బంధుగణం ఉండడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం వంటి అనుకూలతలు ఉన్నాయని విశ్లేషణలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తపై వైసీపీ కీలక నేత, మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టతనిచ్చారు. గురువారం చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీప ప్లీనరీ సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వచ్చే సాధారణ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలు గెలుస్తుంది. కుప్పంలో హీరో విశాల్ పోటీ చేయనున్నారని ఎల్లో మీడియా వార్తలు రాసింది. అలాంటిదేం లేదు. గతంలో పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాడు’ అని చెప్పడంతో ఇప్పటివరకు వచ్చిన వార్తలు అన్నీ ఉట్టి రూమర్లని తేలిపోయాయి.