బాధ్యత ఉండక్కర్లే.. మంత్రి కరోనా జయిస్తే ఇలా చేయాలా.? - MicTv.in - Telugu News
mictv telugu

బాధ్యత ఉండక్కర్లే.. మంత్రి కరోనా జయిస్తే ఇలా చేయాలా.?

July 31, 2020

Minister Recovered Covid Followers Grand Welcome

కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఇంటికి చేరడం అందరికి శుభవార్తే. అలా జయించి వచ్చిన వారిని అక్కున చేర్చుకోవడం సమాజం బాధ్యత. కానీ ఇదే మితిమీరిపోతే మాత్రం ప్రమాదమే. కరోనా జయించారని అతిగా హడావిడి చేసి ఎదుటివారికి ఇబ్బందిగా మారకూడదు. అలాంటి ఓ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. మంత్రి కరోనా నుంచి కోలుకొని ఇంటికి వచ్చారని అతని అనుచరులు చేసిన హడావిడి తీవ్ర విమర్శలకు దారి తీసింది. భౌతిక దూరం అనే మాట మరిచి వేలాదిగా గుమిగూడారు. 

మంత్రి సెల్లూరు రాజు కరోనా బారిన పడటంతో చెన్నైలోని ఎంఐవోటీ ఆస్పత్రిలో చికిత్స పొంది గురువారం డిశ్చార్జి అయ్యారు. ఈ విషయం తెలిసి ఆయన మద్దతుదారులు సంబురాల్లో మునిగితేలారు. నిబంధనలు ఏ మాత్రం లెక్క చేయకుండా గుంపులు గుంపులుగా మోహరించారు. కాన్వాయ్ ముందు టపాకాయలు పేల్చారు. ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు. వీరిలో కొంత మంది మాస్కులు కూడా ధరించలేదు. ఇలా చేయడం వల్ల వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యుత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో  2,39,978 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 1,78,178 మంది కోలుకోగా.. ఇంకా 57,959 మంది చికిత్స పొందుతున్నారు.