ఏపీలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మంత్రి రోజా.. ప్రతిపక్ష పార్టీలపై ఓ రేంజులో సెటైర్లు వేస్తారు. అందుకే ప్రత్యర్ధి పార్టీల నేతలకు టార్గెట్ అవుతుంటారు. ఇందులో భాగంగా రాజకీయ విమర్శలు కామనే అయినా ఆ పరిధి దాటి వ్యక్తిగతంగా మాటల దాడి చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక విషయంలో రోజాపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇంతవరకు పర్వాలేదనుకున్నా ఇది మరీ ఎక్కువయి ఆమె కూతురి దాకా వెళ్లింది. దాంతో మంత్రి రోజా బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల ఓ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ట్రోలింగ్ ప్రస్తావన వచ్చేసరికి ఎమోషనల్ గా ఫీలయ్యారు.
తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకర ట్రోలింగ్ పై స్పందించారు. తన కూతురు అన్షుమాలిక చాలా సెన్సిటివ్ అని అలాంటిది ఆమె ఫోటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాటిని చూసి నా కూతురు చాలా బాధపడింది. ఇలాంటివన్నీ మనకు అవసరమా? అని ముఖం మీదే నన్ను అడిగేసింది. కేవలం నా కూతురే కాదు నా సోదరుడి గురించి కూడా అభ్యంతరకరంగా మాట్లాడారు. ఇది చాలా దారుణం. అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సాధారణమని పిల్లలకు అర్ధమయ్యేలా చెప్పాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.