ఏపీలో ఎమర్జెన్సీ పాలన సాగుతోందన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం1 పూర్తిగా చదివితే.. అర్ధమవుద్దని అన్నారు.చంద్రబాబు భ్రమ నుండి బాలకృష్ణ బయటకు రావాలన్నారు. బాలయ్య ఎమర్జెన్సీ అనడం సిగ్గుచేటు.. దిక్కుమాలిన చర్య అని రోజా ఫైర్ అయ్యారు. బాలకృష్ణకు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్పించి జీవోలు చదవడం రాదా అని ప్రశ్నించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి అని.. జీవో నెం.1 ను ఎందుకు తీసుకొచ్చామో తెలుసుకుంటే ఎమర్జెన్సీ అనే కామెంట్‌ను బాలయ్య వెనక్కి తీసుకుంటారని అన్నారు. ఇక, వీరసింహారెడ్డి మూవీ గురించి మాట్లాడుతూ.. సినిమాల్లో ఎన్ని డైలాగ్స్ కొట్టినా చప్పట్లు కొట్టడానికే పనికొస్తాయని ఎద్దేవా చేశారు.
బాలయ్య బాబు పరిస్థితి స్క్రిప్ట్‌లు రాసిచ్చినా మాట్లాడలేని పరిస్ధితి అని రోజా చురకలంటించారు. చంద్రబాబు సభల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయినా బాలయ్య ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు చేసిన మోసాన్ని కప్పిపుచ్చేలా షో నడిపించారని, ఎవరు చచ్చినా పర్వాలేదని.. తన బావ మీటింగ్ మాత్రం జరగాలని బాలకృష్ణ భావిస్తున్నారని రోజా దుయ్యబట్టారు. ఆదివారం అన్నమయ్య జిల్లా శెట్టిపల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. తాను ప్రతి ఏటా ఇక్కడే సంక్రాంతిని జరుపుకుంటానని.. జగన్ పాలనలో రైతులు సుభిక్షంగా వుంటారని అన్నారు.