జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో సొంత ఎజెండా ఉండాలని, వేరే వారి ఎజెండాతో పని చేసేవారు ప్రజల సమస్యలను ఎలా పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. 2019లో జగన్ ని సీఎం అవ్వనివ్వను అంటూ ప్రగల్భాలు పలికిన పవన్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వకుండా ప్రజలు తీర్పునిచ్చారని దుయ్యబట్టారు. జగన్ సీఎం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వ్యక్తి ఇప్పుడెందుకు రాష్ట్రంలో తిరుగుతున్నాడో అర్ధం కావడవ లేదని దెప్పిపొడిచారు. కాల్షీట్లు ఉన్నప్పుడు నిర్మాతకి, లేనప్పుడు చంద్రబాబుకు డేట్లు ఇచ్చే వ్యక్తి అని, సినిమా హీరో వస్తే ఓట్లు పడతాయనే రోజులు పోయాయన్నారు. పవన్ తో పాటు ఆయన అన్నలను కూడా సొంత ఊళ్లో ప్రజలు ఓడించారని, దాంతో ప్రజల్లో మీకున్న నమ్మకం ఏంటో తేలిపోయిందన్నారు. ‘రాజకీయమంటే పార్ట్ టైమ్ కాదు. ఫుల్ టైం ప్రజలకు అందుబాటులో ఉండాలి.
సీఎం కుర్చీ కోసమే రాజకీయం చేస్తానంటే అది కేవలం సినిమాల్లోనే కుదురుతుంది. ఇప్పటికే వారానికి ఓ సారి రాష్ట్రానికి చుట్టపుచూపుగా వస్తున్నాడు. ఈ సారి ఓడిపోతే రాష్ట్రం సరిహద్దులకు కూడా రాకుండా పోతాడు. పార్టీ మూసేసి హైదరాబదులోనే ఉండిపోతాడు. చంద్రబాబు వెనుక తోకలా తిరిగే పవన్ పక్కన నాగబాబు, నాదెండ్ల మనోహర్ తప్ప ఎవరైనా బీసీలున్నారా? పోలవరంపై గతంలో చంద్రబాబును ప్రశ్నించకుండా ఏం చేశారు? కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని కమీషన్ల కోసం నాశనం చేస్తుంటే నిద్రపోయాడా? ఐదేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు. వైసీపీని, ప్రజల పట్ల నోటికొచ్చినట్టు మాట్లాడితే జనమే దేహశుద్ది చేస్తారు. వారాహితో పాటు పవన్ కల్యాణ్ గంగలో దూకినా ఎవరూ పట్టించుకోర’ని తీవ్రంగా స్పందించారు.