Minister Sabita tested the robot teacher
mictv telugu

టీచర్ జాబులకి ఎసరు.. ప్రభుత్వ స్కూళ్లలో రోబో టీచర్లు : మంత్రి సబితా

July 25, 2022

సమాజంలో రానురాను టెక్నాలజీ పాత్ర పెరిగిపోతోంది. మనుషులు చేసే పనిని రోబోలు చేసేస్తున్నాయి. ఇప్పటికే రెస్టారెంట్లు, ఆస్పత్రులలోని ఆపరేషన్ థియేటర్లలో రోబోలు దర్శనమిచ్చాయి. త్వరలో ఈ రోబోలు టీచర్ల స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండస్ ఇంటర్నేషనల్ స్కూలు తయారు చేసిన ‘ఈగిల్’ రోబోను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరీక్షించారు. 30 భాషల్లో 5వ తరగతి నుంచి 11వ తరగతి వరకు బోధించే సామర్థ్యం ఈ రోబోకు ఉంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, హ్యుమానిటీస్ సబ్జెక్టులు ప్రభావవంతంగా బోధించగలదు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టే ఆలోచనతో నిర్వాహకులు మంత్రి ముందు ప్రదర్శన నిర్వహించారు. వాటి పనితీరు చూసిన మంత్రి సబితా.. ప్రభుత్వ పాఠశాలల్లో రోబో టీచర్లను నియమించే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అటు ఇండస్ స్కూలు సీఈవో, లెఫ్టినెంట్ జనరల్ అర్జున్ రే మాట్లాడుతూ.. హైదరాబాద్, బెంగళూరు, పుణెలోని సంస్థ స్కూళ్లలో 21 రోబోలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కర్ణాటకలో 30 రోబోలు అందించామని, దీని వల్ల టీచర్ల కొరత తీరడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని స్పష్టం చేశారు. కాగా, దీనివల్ల ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇప్పటికిప్పుడు జరిగే నష్టం ఏమీ ఉండదు కానీ, భవిష్యత్తులో మాత్రం టీచర్ నియామకాలపై చాలా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.