మీచేత నూకలు తినిపిస్తాము : ఫైర్ అయిన మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

మీచేత నూకలు తినిపిస్తాము : ఫైర్ అయిన మంత్రి

April 7, 2022

ngh

తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయమని వెటకారంగా మాట్లాడిన కేంద్రమంత్రి చేతే నూకలు తినిపించే నాయకుడు మా కేసీఆర్ అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. పార్టీ ఆదేశాలతో ములుగు జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు నిరసన దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..( రైతు వ్యతిరేక ప్రభుత్వం మెడలు వంచుతాం. ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ పంజాబులో రైతులతో పెట్టుకొని అనంతరం క్షమాపణ చెప్పింది. అదే సీన్ మన రైతుల విషయంలో రిపీటవుతుంది. ధాన్యం కొనుగోలుకు దేశమంతా ఒకే విధానం ఉండాలి. కేంద్రం వైఖరి గమనించిన కేసీఆర్.. వరి వేయొద్దని చెప్తే, బీజేపీ నేతలు వచ్చి కేంద్రంతో మేం కొనిపిస్తామని ప్రగల్భాలు పలికారు.

ఇప్పుడు చూస్తే ఒక్కరు పత్తా లేరు. రైతుల కోసం నిజాయితీగా పనిచేస్తున్నాం. విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో తెలంగాణ రైతాంగం బతుకులు మారుతున్నాయి. సమ్మక్క బ్యారేజ్ పూర్తయింది. మన జిల్లాకు సాగునీరు పుష్కలంగా వస్తాయి. కేసీఆర్ చేసిన కృషి వల్ల ఇదంతా జరుగుతోంది. ఆత్మహత్యలు తగ్గాయి. గతంలో పండుగలప్పుడే అన్నం తినేవాళ్లం. ఇప్పుడు మూడు పూటలా వరి అన్నం తింటున్నాం. రైతు కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసే ప్రభుత్వం తెలంగాణలో ఉంది. బీజేపీ విధానాల వల్ల గుజరాత్‌లో క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతును రాజును చేయాలని మేం కష్టపడుతుంటే, రైతు వ్యతిరేక, వ్యాపారుల అనుకూల పార్టీ అయిన బీజేపీ రైతులను ముంచుతోంది. మీ విధానాలు మార్చుకోకపోతే త్వరలో ఢిల్లీ పీఠం కదలడం ఖాయ’మంటూ విమర్శించింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, జెడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్, రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య , ఇతర టీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.