Minister Srinivas Goud lashed out BJP leaders are just coming to Telangana state as a tourists
mictv telugu

దేశంలో ఎక్కడైనా బీజేపీ ఆటలు కానీ.. తెలంగాణలో మాత్రం కాదు

September 5, 2022

బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రానికి కేవలం టూరిస్టుల్లా వచ్చి ఏదేదో మాట్లాడి పోతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మహబూబ్ నగర్‌లో రెండు రోజుల పాటు పర్యటించిన కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే.. రాష్ట్రంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడి వెళ్లిపోయారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న పాండే కు విషయాల పట్ల కనీస అవగాహన లేదన్నారు. పీఎం మోడీ ఎన్నికలప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి పథకం పై ఏ హామీ ఇచ్చారో కేంద్రమంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ మొదటగా అనుమతినిచ్చిన విషయం పాండే కు తెలియదా అని అన్నారు. జిల్లాలో పర్యటనకు వచ్చేముందు కనీసం జిల్లా పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకుని కేంద్రమంత్రి మాట్లాడితే బాగుండేదని ఎద్దేవా చేశారు.

సోమవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం అయ్యాకే పాలమూరు జిల్లా దశ మారిందన్నారు. మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీ కేసీఆర్ ఇచ్చారా మోడీ ఇచ్చారా అని ప్రశ్నించారు. జిల్లా నుంచి వలసలను ఆపింది కేసీఆర్ అని , పది లక్షల ఎకరాలకు నీరు పారించింది కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ నుంచి కేంద్రం తీసుకోవడమే తప్ప ఇస్తున్నది ఏమీ లేదన్నారు. ప్రధాని మోడీ యే స్వయంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు.. మరి ఎందుకు పట్టించుకోరన్నారు. పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వరు కానీ..కర్ణాటక లో అప్పర్ భద్రకు ఇస్తారు.. ఇది తెలంగాణ పై వివక్ష కాదా అని మండిపడ్డారు. పైసలు ఇచ్చేది లేదు కానీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేతల పిచ్చి మాటలు నమెందుకు ప్రజలు పిచ్చోళ్లు కాదని, భారత దేశాన్ని ప్రమాదం లోకి నెట్టేస్తున్న పార్టీ బీజేపీ అన్నారు. కేవలం ఒకరిద్దరు వ్యాపార వేత్తల కోసం బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఏ వర్గానికి న్యాయం చేయడం లేదన్నారు. దేశంలో బీజేపీ ఆటలు ఎక్కడైనా సాగొచ్చు కానీ .. తెలంగాణలో మాత్రం కాదని అన్నారు. రేషన్ షాపుల దగ్గర మోడీ ఫోటో కాదు.. సిలిండర్ల పై మోడీ బొమ్మ వేయాలని డిమాండ్ చేయాలని కౌంటర్లు వేశారు.