రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేస్తోంది. ఇప్పుడు ఇదే పద్ధతిని మరో పథకానికి అన్వయించింది ప్రభుత్వం. గొల్ల కురుమల కోసం గతంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం తెలిసిందే. దీని కింద లబ్దిదారులకు నేరుగా గొర్రెలను పంపిణీ చేసేవారు. కానీ మునుగోడు ఉప ఎన్నిక నుంచి నిబంధనలు మార్చి గొర్రెలు కాకుండా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లో నేరుగా డబ్బులు జమచేయాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలను ఎంపిక చేసింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అప్పుడు అమలు చేయలేకపోయింది. నగదు జమ ఆలస్యం కావడంతో కొందరు దరఖాస్తు దారులు మంత్రి తలసాని శ్రీనియాదవ్కి ఫిర్యాదు చేయగా, మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను 15 రోజుల్లో లబ్దిదారుల అకౌంట్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ డబ్బుతో నాణ్యమైన గొర్రెపిల్లలను కొనుగోలు చేయించాలని సూచించారు. దీంతో ఈ పథకం కింద త్వరలో 4699 మంది లబ్దిదారుల అకౌంట్లో ప్రభుత్వ వాటా కింద ఒక్కొక్కరికి రూ. 1.58 లక్షల చొప్పున జమ కానుంది. మంత్రి ఆదేశాల పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
కాళేశ్వరానికి డీపీఆరే లేదు.. ఎన్ని సార్లు డిజైన్ మార్చిర్రు..ఎవరికోసం మార్చిర్రు.. అన్ని తెలుసు మాకు