Minister Talasani spoke about the festivals in a media conference
mictv telugu

మాట్లాడితే హిందూ అంటారు.. మరి మేమెవరం?

September 5, 2022

బీజేపీ వాళ్లు మాట్లాడితే హిందువులు, హిందూ పండుగలు అంటుంటారని, మరి మేమెవరమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. సోమవారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకచవితి, నిమజ్జనం, బీజేపీ గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే.. ‘వినాయక చవితి, నిమజ్జనంపై మూడు నెలల నుంచి ఇప్పటివరకు అనేక సార్లు సమీక్ష నిర్వహించాం. నగరంలో ఏర్పాటైన 39 వేల గణపతి విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వసతులు ఏర్పాటు చేసింది. ఈ విషయంలో ఎవరూ బీజేపీ మాటలను నమ్మవద్దు. తెలంగాణ వచ్చాక పండుగలు జరిపే పరిస్థితి మారింది. బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా జరుపుకుంటున్నాం. పండుగలను రాజకీయాలకు వాడుకోవడం మంచిదికాదు. హిందువుల పండుగలు అంటున్నారు. మరి మేమెవరం? మేము స్వతహాగా వినాయకుడిని పెట్టేవాళ్లం. బోనాలు ఎత్తేవాళ్లం. క‌ృష్ణాష్టమిని జరుపుకున్నాం. ఇంత చేసినా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు. కేసీఆర్ కంటే గొప్ప హిందు ఎవరుంటారు? జిల్లాలకు, సాగునీటి ప్రాజెక్టులకు హిందూ దేవుళ్ల పేర్లు పెట్టారు. యాదాద్రిని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు గొప్పగా ఉండాలని కేసీఆర్ అనేక మంచి నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని గమనించకుండా ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం బాధించింది’ అని తెలిపారు.