దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి విషాదంలో ముంచింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల.. శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. కైకాల మరణ వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. వెంకటేష్, రాఘవేంద్రరావు, మోహన్ బాబు , మెగాస్టార్ చిరంజీవి తదితరులు కైకాల భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్‌లోని కైకాల నివాసానికి వెళ్లి.. కైకాల మృతదేహంపై పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కైకాల అంత్యక్రియలు ప్రభుత్వపరంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు. అధికారిక లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు చేస్తామని తెలిపారు.
కైకాల మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ… తన వైవిధ్యమైన నటన ద్వారా… మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కైకాల పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. కైకాల కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సంతాపం తెలిపారు.