Minister talasani srinivas yadav responded on the issue of protocol
mictv telugu

సీఎం తప్పక ప్రధానిని రీసివ్ చేసుకోవాలని ఏం లేదు: మంత్రి తలసాని

July 2, 2022

ప్రోటోకాల్‌ ప్రకారం సీఎం తప్పనిసరిగా ప్రధానిని రిసీవ్ చేసుకోవాలని ఎక్కడ లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీకి బేగంపేట ఎయిర్‌పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చిన మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిని బట్టి ఉంటుందన్నారు. ప్రోటోకాల్‌ ప్రకారం సీఎం తప్పనిసరిగా ప్రధానిని రిసీవ్ చేసుకోవాలని లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతినిధిగా కేబినెట్‌లో ఉన్న వ్యక్తి రిసీవ్ చేసుకోవచ్చని చెప్పారు.

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఉన్నారని.. ఆయనకు టీఆర్ఎస్ మద్దతిస్తుందని చెప్పారు. ఆయన జూలై 2వ తేదీన హైదరాబాద్‌కు వస్తానని సీఎం కేసీఆర్‌కు చెప్పడంతో ఆయనను రిసీవ్ చేసుకోవడం జరిగిందన్నారు. బీజేపీ వాళ్లు సీఎం కేసీఆర్ మీద వాళ్ల పార్టీ ఆఫీసులో ఓ క్యాప్షన్ పెట్టడం జరిగిందన్నారు. ఆ తర్వాత బై బై మోదీ తెరమీదకు వచ్చిందన్నారు. బీజేపీ నేతలను ఉద్దేశించి హైదరాబాద్‌కు టూరిస్ట్‌లు వచ్చారని ఎద్దేవా చేశారు. వారు హైదరాబాద్ అందాలు, అభివృద్ది చూసి నేర్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దేశ అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముందస్తు ఎన్నికలకు కేంద్రంలో బీజేపీ సిద్ధమైతే మేమూ రెడీ అంటూ తలసాని వ్యాఖ్యానించారు. భారత్ బయోటెక్‌కు ప్రధాని వచ్చినప్పుడు ప్రొటొకాల్ అవసరం లేదా?.. సీఎం అవసరం లేదా?.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. తాము బీజేపీకి భయపడేది లేదని చెప్పారు.