Minister Talasani Srinivas Yadav said that there are no restrictions regarding Ganesh immersions.
mictv telugu

పండుగలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం.. మంత్రి తలసాని

September 7, 2022

గణేశ్‌ నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గణేశ్‌ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు. ఇవాళ ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకున్న మంత్రి తలసాని.. పర్యావరణహిత గణేశ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్దఎత్తున వినాయక చవితి ఏర్పాట్లు చేయడంలేదన్నారు. ఓవైపు గణేశ్‌ నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతుంటే.. బీజేపీ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. ర్యాలీలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. పండగలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి తలసాని పరిశీలించారు. అక్కడ ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 1 నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌ వరకు వెళ్లి పరిశీలించారు. పోలీసు సహా అన్ని ప్రభుత్వ శాఖలు నిమజ్జనం కోసం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.