ఏపీ రాజకీయా పార్టీలపై మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వైసీపీ, టీడీపీ పాలన తీరును ఆయన దుయ్యబట్టారు. ఎంతసేపు కులపిచ్చి,రాజకీయాలు తప్ప ఏపీలో అభివృద్ధి శూన్యమన్నారు. ఏపీ లోని పలు జిల్లాల నుంచి బీఆర్ఎస్లో చేరిన నాయకులను ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ బాగుపడాలని కోరుకున్నారు తప్ప ..ఆంధ్ర ప్రజలకు ఏనాడు అన్యాయం చేయాలని చూడలేదన్నారు.
ఏపీలో రాజకీయ పార్టీల పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని విమర్శించారు. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రెండు పార్టీల మద్దతు మోదీకే ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టినా రాష్ట్ర నాయకులు నోరు మెదపడం లేదన్నారు.
వైజాగ్ ని ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నా..ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో కూడా ప్రజల పక్షాన పోరాడే కేసీఆర్ వంటి నాయకుడు అవసరమని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వం కావాలని ఏపీలో కూడా చాలా మంది కోరుకుంటున్నారని తెలిపారు.